మంత్రివర్గ భేటీలో సీఎం మంచి నిర్ణయం తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని సూచించారు. 2020 డిసెంబర్‌లోనే తెలంగాణ రాష్ట్రానికి పీఎంకేర్ నుంచి 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని.... కానీ ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేర్ నిధులు ఎక్కడికి పోయాయో స్పష్టం చేయాలని జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
వ్యాక్సిన్‌ను కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తుంటే... రాష్ట్రం ఏమిస్తుందో చెప్పాలన్నారు. ఒకవేళ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనుకుంటే బకాయిలను చెల్లించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణకు 440టన్నుల ఆక్సిజన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఆక్సిజన్‌ను తెచ్చుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని మండిపడ్డారు. కొవిడ్ మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాత్రి కర్ఫ్యూ సరిగా అమలవ్వడం లేదని విమర్శించారు.
ఇదీ చూడండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు