జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాజపా దూకుడు పెంచుతోంది. ఎన్నికలు ముగిసే వరకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు భాగ్యనగరానికి వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేసింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక, కాచిగూడ డివిజన్‌లలో ఇవాళ ప్రచారం చేయనున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య రెండు రోజుల ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కు రానున్నారు.
రేపు ఉదయం హిమాయత్‌నగర్‌లో కన్నడ సంఘం వాళ్లతో అల్పహారం విందుకు హాజరవుతారు. తర్వాత ప్యాట్నీ సెంటర్‌లో 'లాంచ్ ఆఫ్ ఛేంజ్ హైదరాబాద్' కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కలిసి పాల్గొంటారు. అనంతరం గాజులరామారంలో పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో, బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లిలో అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయనున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ సైదాబాద్, మన్సూరాబాద్, హస్తీనాపురంలో ప్రచారం చేయనున్నారు.
ఇదీ చదవండి: భాజపా సర్కారుపై 132 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి: కేటీఆర్