చైనా ఆక్రమణ స్వభావాన్ని సవాల్ చేస్తూ.. మన సైనికులు పనిచేస్తున్నారని భాజపా సీనియర్ నేత రామ్‌మాధవ్ వెల్లడించారు. చైనా స్వభావాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత సైనికపరమైన సమస్యే కాదని... ఆర్థికపరమైన అంశాలపై ప్రభావం చూపుతుందని రామ్‌మాధవ్ అన్నారు.
అవేర్ నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడలో 'ఇండో- చైనా వివాదం.. ముందున్న కర్తవ్యం' అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు రామ్‌మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా వ్యవహారం పట్ల దృఢంగా ఉంటే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని ఆయన ఆక్షేపించారు. చైనా భారత్‌కు ఆర్థికపరమైన సవాల్‌ను విసురుతోందన్నారు.
ఆర్థిక శక్తితో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా ప్రయత్నిస్తోందని తెలిపారు. సాంకేతికతతో ప్రపంచాన్ని నియంత్రించాలని చూస్తుందని చెప్పారు. చైనాను ఎదుర్కొవాలంటే భారత్ ఆర్థిక సాంకేతికతో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరికో వ్యతిరేకంగా దౌత్యపరమైన కూటములు కట్టడానికి భారత్ సిద్దంగా లేదని రామ్‌మాధవ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : భారత్‌కు సైబర్ యుద్ధం పొంచి ఉంది : రాజ్‌నాథ్ సింగ్