BJP Reaction on Rajagopal Reddy Resignation 2023 : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal reddy Resign) రాజీనామాపై.. పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఖండించారు. ఆయన అన్నంత మాత్రాన బీఆర్ఎస్కు.. బీజేపీ పోటీ కాకుండా పోతుందా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండటం, వీడటం ఎవరి ఇష్టం వారిదని పేర్కొన్నారు.
MP Laxman on Rajagopal Reddy Resignation : రాజగోపాల్ రెడ్డి.. పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డికి.. పార్టీ జాతీయ స్థాయిలో మంచి స్థానం కల్పించిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రక్తం చిందిస్తున్నారని.. అలాంటి జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇప్పుడు నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు.
కచ్చితంగా మూడో సారి మోదీ ప్రధాని కాబోతున్నారని ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారు ఆలోచించి ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. జనసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీగా బీజేపీ జాతీయ భావాన్ని పెంపొందిస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు.
"ఎవరి ఊహలు వాళ్లవి ఎవరి ఆలోచనలు వాళ్లవి. బీజేపీ ప్రజల్లో లేదని అతను అంటే సరిపోతుందా?. పార్టీ మీద ఆ రకమైన నిందలు వేయడం మొత్తం తెలంగాణ సమాజమే గమనిస్తుంది. బీజేపీ నాయకత్వం జాతీయ స్థాయిలో కార్యవర్గ సభ్యునిగా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు పార్టీని వీడి వెళిపోతాను అంటే అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నా. వారు అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు రాజీనామా చేశారో వారే చెప్పాలి తప్పా.. తమకు తెలియదు. ఎన్నికల ముందు ఇక్కడ టికెట్ రాకపోతే అక్కడకు అక్కడ టికెట్ రాకపోతే ఇక్కడకు బంప్‌లు చేయడం అలవాటే. ఎన్నికల ముందు ఇలాంటి వారు పార్టీలు వీడడం సహజమే." - బీజేపీ రాష్ట్ర నాయకులు
Rajagopal Reddy quits BJP : రాజగోపాల్ రెడ్డి ఒక పాసింగ్ క్లౌడ్ లాంటివాడని.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించిన ఆయన.. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుందని, కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. బీజేపీ తరఫున ఎంపీగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ మారుతారన్న ప్రచారంపై భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు. తాను పార్టీ మారుతారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతుందని.... అదంతా తప్పని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని వివేక్ తెలిపారు.