BJP Protest in GHMC Council Meeting : హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రసభాసగా సాగింది. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి వాడివేడీగా వాదోపవాదాల మధ్య గందరగోళంగా సాగడంతో ఐదు నిమిషాల పాటు మేయర్ సభను వాయిదా వేశారు. మొదటగా తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సభ నివాళులర్పించింది.
GHMC Council Meeting Today : నివాళులర్పించే ముందు సమైక్యత దినోత్సవం కాదని.. విమోచన దినోత్సవంటూ భాజపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే నరకమేనని.. అధికారంలో ఉండి ఏం అభివృద్ది చేశారో వర్షం వస్తే తెలుస్తోందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత ఎద్దేవా చేశారు. ఎస్‌ఎన్‌డీపీ కింద జరుతున్న పనులు నత్త నడక సాగుతున్నాయనే విషయంలో సమావేశంలో రగడ మొదలైంది.
ఈ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. బంజారాభవన్, కొమురం భీం భవన్ నిర్మాణాలపై తెరాస కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలపడంపై భాజపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారని ఆందోళన చేశారు. తెరాసలో చేరిన కార్పొరేటర్ల అంశంపై కూడా గొడవ జరిగింది.
ఈ క్రమంలో భాజపా కార్పొరేటర్లు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. తెరాస సిద్దాంతాలు నచ్చే వారు చేరారని బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు. దీనికి భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. పది నిమిషాల తర్వాత యథావిధిగా సభను నిర్వహించారు.
ఇవీ చదవండి.. విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్.. కారణం తెలిస్తే.!