ప్రజలను మోసం చేసే తెరాసకు కర్రు కాల్చి వాత పెట్టినట్లు ప్రజలు బుద్ధి చెప్పాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్ భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ఆయన, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డివిజన్ ఆ పార్టీ అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్ ప్రారంభించారు.
ప్రస్తుత కొవిడ్ సమయంలో తెరాస ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని లక్ష్మణ్ ఆరోపించారు. కరోనా వచ్చిన బాధితులకు వైద్య పరీక్షలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షలు దోచుకుంటున్న ప్రభుత్వం తమకు పట్టనట్టుగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదలు ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉండగా ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల హృదయాలను తీవ్రంగా కలచి వేసిందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమకు అధికారం లేకున్నా బాధితులను ఆదుకోవడంలో తమ పార్టీ ముందు ఉంటుందన్నారు.
పేద ప్రజలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన తెరాస పట్ల ప్రజలు విసిగిపోయారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా భాజపాను గౌరవిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్ ఎలా మారిందో తెలుసా..?