BJP Parliament Prawas Yojana meeting: బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం నేడు హైదరాబాద్‌లో జరగనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించనున్నారు. ప్రవాస్ యోజన సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్లమెంట్ కన్వీనర్, ప్రభారీ, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు.
షా పర్యటనపై చర్చ: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, తమ పార్టీలో చేరే ఇతర పార్టీల నాయకుల గురించి, షా పర్యటన సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 23న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అమిత్ షా పర్యటన వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది.
సమావేశం అనంతరం స్పష్టత: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. రేపు జరిగే సమావేశం అనంతరం అమిత్ షా పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన పర్యటన ఖరారు అయితే చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ నేతలు ఎప్పుడూ కేంద్ర మంత్రులను అస్త్రంగా వాడుతున్నారు. గతంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలగు వారు రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ సభా వేదికగా పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
- MP AVINASH: కాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
- అతీక్ అహ్మద్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు.. సిట్ ఏర్పాటు
- 'కల్తీ మద్యం వల్లే 26 మంది మృతి'.. ధ్రువీకరించిన అధికారులు.. పరిహారం ప్రకటించిన సీఎం
- MP AVINASH PETITION: "వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అరెస్టు చేసే ఉద్దేశంతో సీబీఐ"