రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి అరుణ్‌సింగ్ హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, హుజూర్నగర్ ఉప ఎన్నిక, పార్టీలో చేరికలు, పార్టీ బలోపేతంపైన చర్చించారు. అకారణంగా 48 వేల ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించటం దుర్మార్గమని అరుణ్‌సింగ్ పేర్కొన్నారు. సమ్మెపై హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల బంద్‌లో తమ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు చాలామందిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. కార్మికుల పక్షాన పోరాటం చేసిన వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దురహంకారంతో వ్యవహరిస్తున్నారని అరుణ్‌సింగ్ విమర్శించారు. ఈ సమావేశానికి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి హాజరయ్యారు.
ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై