MP Laxman on Rahul Gandhi BJP BC CM Comments : బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ బీజేపీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేయడంపై బీజేపీ నేతలు స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై మాటల తూటాలు సంధించారు. రాహుల్ గాంధీకి బీసీలంటే చిన్న చూపు అని.. బీసీని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పిన వ్యక్తి కేసీఆర్ అని.. ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలకు అసలు బీసీ వర్గంపై ప్రేమ లేదని అన్నారు.
'బీజేపీ బీఆర్ఎస్లకు బీసీలకు అధికారం ఇవ్వడం నచ్చదు అందుకే కుల గణనకు రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదు'
'163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ బీజేపీ. ఓబీసీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది మా పార్టీ. దేశ ప్రజలంతా మోదీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీల వ్యతిరేక పార్టీలు. రెండో జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తాం. బీసీల ఆత్మవిశ్వాసాన్ని మేం కాపాడతాం. రాహుల్ గాంధీ బీసీలను అవమానపరిచారు.. మేం ఇది సహించం. అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. బీసీలు బీజేపీకి దగ్గరవుతారన్న అక్కసుతో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు. బీసీలు తమకున్న ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ, కేసీఆర్లు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి.' అని లక్ష్మణ్ కోరారు.
MP Laxman on Rahul's BJP BC CM Comments : 1358 ఓబీసీ శాసన సభ్యులు బీజేపీ తరపున గెలిచారని.. 160 మందికి శాసనమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చామని లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణలో ఈనెల 7వ తేదీన సాయంత్రం బీసీల ఆత్మగౌరవసభ పేరుతో హైదరాబాద్ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాని ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. తెలంగాణలో పసుపు రైతులకు న్యాయం చేస్తామని.. పసుపు బోర్డ్ తెలంగాణలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తారని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
"తెలంగాణలో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నదో టీడీపీనే చెప్పాలి. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదు. పరస్పరం లాభం ఉంటేనే పొత్తులు ఉంటాయి. జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుంది. తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం ఉంటుంది. నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదు. ప్రజలు.. ప్రజల ఓట్లు మాతోనే ఉన్నాయి. నేతలు బయటకి వెళ్లినంత మాత్రాన వారి ఓట్లన్నీ వెళ్లిపోవు." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
MP Laxman on BJP BC CM : కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లు ప్రకటించే తాయిలాల కోసం తాము ఆరాటపడడం లేదని నిరూపించుకోవాలని బీసీలను లక్ష్మణ్ కోరారు. అందుకే తమ వద్ద ఉన్న ఓటు ఆయుధాన్ని వాడి బీజేపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతైందన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని సూచించారు. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీసీ వ్యక్తి ప్రధాని అయితే రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను రాహుల్ గాంధీ విరమించుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు.
Bandi Sanjay Fires on Rahul Gandhi : అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఎద్ధేవా చేశారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదని మండిపడ్డారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.