MP Laxman Latest comments on KCR : రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బయటపడుతుందనే భయంతోనే సీబీఐ రావొద్దంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర నిధులన్నీ టీఆర్ఎస్ సర్కారు పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాములుగా మారాయని ఎద్దేవా చేశారు. శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ గోషిస్తోందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
MP Laxman Latest comments on Kavitha : గల్లీగల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం కూతురైనా.. ఎవరైనా చట్టాలకు ఎవరూ అతీతం కాదని తేల్చిచెప్పారు. కుంభకోణంలో ప్రమేయం లేదన్నప్పుడు నిరూపించుకోవాలని అన్నారు.
"తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా.. ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారు. ప్రభుత్వ భూములన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. పేదవాడు వంద గజాల భూమి కొనకుండా విపరీతంగా ధరలు పెంచారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి సొమ్ముతో రాజ్యమేళాలని చూస్తున్నారు. కేసీఅర్ కుటుంబం అవినీతికి అడ్డుకట్ట వేయకుండా ఉండేందుకు సీబీఐని తెలంగాణకు రానియ్యం అంటున్నారు." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీయేమో ప్రజలను గాలికొదిలేసిందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, చేష్టలు చూస్తుంటే మహ్మద్ తుగ్లక్ గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దని మండిపడ్డారు.
"1956లోనే ప్రత్యేక తెలంగాణ కోసం నా తండ్రి మర్రి చెన్నారెడ్డి కేంద్రాన్ని ఎదురించారు. ప్రపంచం మొత్తానికి తెలంగాణ గురించి తెలియజేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ.. ఇప్పుడు అత్యధిక స్థానాలు గెలిచి దేశాన్ని పాలిస్తోంది. ప్రజల విశ్వాసం కోల్పోయింది." - మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ నేత