BJP MP Laxman fires on CM KCR: తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించారని.. పంజాబ్ సీఎంకు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను కలువనిస్తే కేసీఆర్ బండారం బయటపడేదని పేర్కొన్నారు. గతంలో దిల్లీ వెళ్లిన కేసీఆర్ బస్తీ దవాఖానాలు భేష్ అన్నారని... ఇప్పుడు వచ్చిన భగవంత్ మాన్ కాళేశ్వరం ప్రాజెక్టును పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ నదులకు నడక నేర్పారా లేక లిక్కర్‌కు నడక నేర్పాడా అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కొండగట్టు నుంచి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. తెలంగాణ భక్తులు హుండీలో వేసింది కాకుండా ఆలయాల అభివృద్దికి ఇచ్చిన నిధులు ఎంతో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయప్రకాష్ నారాయణ సోదరుడు నాగేంద్రబాబు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
'ఇతర రాష్ట్రాల్లో ప్రజలు గెలిపిస్తేనే అది జాతీయ పార్టీ అవుతుంది. ఎవరికి వారే చెప్పుకుంటే అది జాతీయ పార్టీ కాదు. రాష్ట్రంలో మద్యం పారుతుందో, నదులు పారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అన్నట్లు వారి తీరు మారింది. దేశమంతా మద్యం పారించాలని బీఆర్ఎస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి. దేశమంతా కొత్త మద్యం పాలసీని తేవడానికి కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు దిక్కు తోచనిస్థితిలో ఉన్నారు. పేదల భూములను ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు లాక్కున్నారు. కాళేశ్వరం కింద భూములు కోల్పోయిన 70 శాతం మందికి పరిహారం ఇవ్వలేదు.'-లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు
ఇవీ చదవండి: