BJP MP Laxman Comments on Job Recruitments : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్(CM KCR) మోసం చేశాడని.. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కె.లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడి ఉన్నవని.. అందుకే విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు ఏ వర్గం సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవడం ఖాయమన్నారు. నిరుద్యోగ యువతే.. తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోయనున్నారని పేర్కొన్నారు.
'కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిస్తే రాష్ట్రాన్ని భిక్షమెత్తుకునేలా చేశారు'
Telangana Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా నిరుద్యోగ యువత ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష.. నీళ్లు, నిధులు, నియామకాలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే.. భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత.. ఇప్పటివరకు గ్రూపు-1 పరీక్ష నిర్వహించలేదన్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని.. ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను ఊడదీశారని విమర్శించారు. రాజకీయ పరమైన ఉద్యోగాలను మాత్రం క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితను(MLC Kavitha) ప్రజలు ఓడగొడితే.. దొడ్డిదారిన పదవి తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని యువత ప్రశ్నిస్తోందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీసీలంటే చిన్నచూపు బీజేపీ రెండో జాబితాలో వారికే అధిక ప్రాధాన్యం : లక్ష్మణ్
BJP Election Campaign in Telangana : నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని.. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని పిలుపునిచ్చారు. రెండు వేల ఫించన్ కావాలా?.. మీ పిల్లలకు 50వేల జీతాలు కావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓటు ద్వారా రద్దు చేయకపోతే.. పరీక్షలు రద్దవుతూనే ఉంటాయని ధ్వజమెత్తారు. భారత రాజకీయ చరిత్రలోనే అబద్ధాల ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు.
అమిత్‌షా రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వస్తున్నారని.. గద్వాల్, వరంగల్, మెదక్ సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్(MRPS) నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిపారు. ప్రభుత్వానికి పదేళ్ల నుంచి గుర్తుకురాని రేషన్ కార్డు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వని మీకు.. ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కొత్త రేషన్ కార్డులు ఇస్టామంటూ.. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
"తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష.. నియామకాలను చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫమైంది. యువత భవిష్యత్తుపై.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే.. భర్తీ చేయలేదు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా.. నిరుద్యోగ యువత పనిచేస్తోంది". - లక్ష్మణ్, బీజేపీ నేత
ప్రగతిభవన్‌లో పడుకునే నాయకుడు కావాలా? - ప్రజల కోసం పని చేసే మోదీ కావాలా?