కిషన్‌రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీలు ఫిరాయించే రేవంత్ రెడ్డి.. భాజపా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు పక్కనచేరి ఓటు కోసం కోట్లు ఇవ్వచూపి అడ్డంగా దొరికిన వ్యక్తి భాజపా నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు.
మాపై విమర్శలు మాని కనుమరుగవుతున్న కాంగ్రెస్ గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్, తెరాస మధ్య ఉన్న సంబంధాలను ముందు తేల్చుకోవాలని సూచించారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా నిబద్ధత, నిజాయతీగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలు కొనసాగిస్తే మీ పార్టీకి పుట్టగతులుండవని రాచందర్ రావు హెచ్చరించారు.