BJP MLA's House Arrest: భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జనగామలో బుధవారం తెరాస, భాజపా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఈటల రాజేందర్, రాజాసింగ్ వెళ్తారన్న సమాచారంతో పోలీసులు రాత్రి నుంచే ఎమ్మెల్యేల నివాసాల వద్ద మోహరించారు. పోలీసుల తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్ మండిపడ్డారు. ధర్నాలు చేయడానికి ఒక్క తెరాస పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా అని ప్రశ్నించారు. వారు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. పైగా దెబ్బలు తిన్నవారిమీదనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా వాపోయారు.
ధర్నాలు చేయడానికి ఒక్క తెరాస పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా?. తెరాస వారు దాడులు చేయవచ్చు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దెబ్బలు తిన్నవారిమీదనే పోలీసులు కేసులు పెడుతున్నారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా?. టీచర్లు ధర్నా చేస్తే వాళ్లను చితకబాదారు. తెరాస వాళ్లకేమో పోలీసులు బందోబస్తు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ?. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం లేదా ? తెలంగాణలో పౌర స్వేచ్ఛ లేదు. ఇచ్చిన తెలంగాణ గురించి మోదీ మాట్లాడారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద వేధింపులు, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగం, ధరణి పేరిట లక్షల ఎకరాలు మాయం చేయడం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, పింఛన్లు అందరికీ ఇవ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు ఇవ్వకపోవడం, నాలుగేళ్లుగా చిన్న చిన్న బిల్లులు లేవు. ఇవన్నీ చేయాల్సిన మంత్రులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు.
-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
జనగామలో బుధవారం ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చదవండి: