BJP MLA Rajasingh On Rape Case: నగరం నడిబొడ్డున సామూహిక అత్యాచారం జరిగితే నిందితులను అరెస్ట్ చేయకపోవడాన్ని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. మజ్లిస్ ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేయకుండా అతను విదేశాలకు పారిపోయేదాకా మీనమేషాలు లెక్కించడం చూస్తే తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అధికారికంగా వినియోగించే ప్రభుత్వ వాహనంలోనే అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెరాస, మజ్లిస్ నాయకులు ఏం చేసినా చెల్లుతుందనే భావనతో బరితెగించి హత్యలు, అత్యాచారాలు చేయడానికి అధికారిక వాహనాలను, కార్యాలయాలను అడ్డాగా చేసుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
మే నెల 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే... ఆ కేసులో తెరాస, మజ్లిస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఛైర్మన్, ప్రముఖుల కుమారులున్నట్లు సీసీటీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నా... ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. స్వయంగా హోంమంత్రి మనవడు నిందితులందరికీ పబ్‌లో పార్టీ ఇచ్చినట్లు తేలిందని.. అయినా నిందితులను తప్పించేందుకు కేసును నీరుగారుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసుల విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం తమకు లేదని.. భాజపా పోరాడేదాకా పోలీసులు కనీసం ఈ కేసుపై స్పందించనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... దోషులను శిక్షించేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెరాస, మజ్లిస్ నేతల ఆగడాలకు అంతులేదు: సోయం బాపూరావు
రాష్ట్రంలో తెరాస, మజ్లిస్ నేతల అరాచకాలకు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో తెరాస నేతల హస్తం ఉంటోందని విమర్శించారు. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలతో పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో తెరాస నేతల వేధింపులు తాళలేక భాజపా కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై తెరాస నేతల గ్యాంగ్ రేప్, రామాయంపేటలో తెరాస మున్సిపల్ ఛైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కొడుకుల ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై తెరాస మున్సిపల్ ఛైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలే వీరి అరాచకాలకు నిదర్శనమన్నారు.
నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేయడం తెరాస, మజ్లిస్ ఆగడాలకు పరాకాష్టగా నిలిచిందని సోయం బాపూరావు పేర్కొన్నారు. ఈ కేసులో తెరాసకు చెందిన ఓ బోర్డు ఛైర్మన్ కుమారుడు, మజ్లిస్ ఎమ్మెల్యే కుమారుడితోపాటు, తెరాసకు చెందిన ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు అన్ని ఆధారాలు లభించాయని ఆరోపించారు. సీసీపుటేజీ రికార్డుల్లో ఛైర్మన్ ఉపయోగించే ప్రభుత్వ వాహనంలోనే అత్యాచారం జరిగినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని తెలిపారు. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూలన దాగి ఉన్నా అందరినీ అరెస్ట్ చేసి కఠిన శిక్షపడేలా చేయాలని సోయం బాపూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Jubilee Hills Gang Rape Case: కారులో క్లూస్ టీమ్‌కు దొరికిన బాలిక వస్తువులివే..!
భాజపా నుంచి నవీన్ జిందాల్ బహిష్కరణ.. నుపూర్ శర్మ సస్పెండ్