Etela Comments On KCR: రాష్ట్ర ప్రజలు తనను విశ్వసించడం లేదనే సీఎం కేసీఆర్... అబద్ధాల ప్రచారానికి పూనుకున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకే ప్రశాంత్ కిశోర్ వంటి వ్యూహకర్తలను నియమించుకుని.... గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ కంటే తెలంగాణ ప్రజలు మేధావులని ఈటల వ్యాఖ్యానించారు.
ప్రజల ఛీత్కారం
మోటర్లకు మీటర్లు పెట్టే ఆలోచనలేదని కేంద్రం తేల్చిచెప్పినా.... రైతులను అయోమయానికి గురిచేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ పదజాలాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారన్నారు. కేసీఆర్ మాట్లాడే భాషే.. తెలంగాణ సంస్కృతి అని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలనూ తన మోసపూరిత హామీలతో కేసీఆర్ దగా చేస్తున్నారని దుయ్యపట్టారు.
అందుకే పీకే సాయం
"కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి అరిష్టమని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చారు. మోకాళ్ల మీద నడిచినా... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌కు బానిసలుగా మారారు. గంటల తరబడి సీఎం ప్రెస్‌మీట్లకు హుజూరాబాద్ ఓటమే కారణం. రాష్ట్రంలో తన పని అయిపోయిందని భావించే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుంటున్నారు. ఆయన కంటే తెలంగాణ ప్రజలు మేధావులు" -ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే
ఎప్పుడైనా అదే తీర్పు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా హూజూరాబాద్ తీర్పే వస్తుందని ఈటల జోస్యం చెప్పారు. చరిత్ర గతిని మార్చేది సలహాదారులు కాదు.. ప్రజలేనన్న సంగతి కేసీఆర్ మర్చిపోయారని వెల్లడించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఒక్కటే మంత్రి పదవి ఇచ్చి దళితులను మోసం చేశారన్న ఈటల.. సగానికి పైగా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే కేసీఆర్‌కు భవిష్యత్తు ఉంటుందని ఈటల హెచ్చరించారు.
ఇదీ చదవండి: జాతీయస్థాయి వార్తల్లో ఉండేందుకే సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ విమర్శలు: బండి