BJP Manifesto Telangana 2023 : బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా.. మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు వరకు తొలి జాబితా(BJP MLA First List 2023) వస్తుందని అంతా భావించారు.. కానీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం తెలంగాణ అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం. నేడో, రేపో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 60మందితో.. ఈనెల 18న తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న బీజేపీ.. కేంద్రమంత్రులు, జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
BJP Election Plan in Telangana : ప్రజల్ని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను.. కమలం పార్టీ సిద్ధం చేస్తోంది. అన్ని వర్గాలకు చెందిన అంశాలు పొందుపరిచేలా.. మేధావులు, నిపుణుల సలహాలు సూచనలు స్వీకరిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో(BJP Election Manifesto) కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ సూచనలపై కసరత్తు చేసింది.
BJP Rainbow manifesto in Telangana 2023 : మరోవైపు బీసీల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టాల్సిన సంక్షేమ పథకాలపై బూరనర్సయ్య గౌడ్ నేతృత్వంలోని ఉపకమిటీ చర్చించేందుకు సమావేశమైంది. ఆ కమిటీ బీసీల జీవన ప్రమాణాలు పెంపొందించేటువంటి సంక్షేమ పథకాలకు రూపొందించి మేనిఫెస్టో కమిటీకి అందించనుంది. మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, కర్షకులు.. మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన ప్రణాళికకి దీటుగా బీజేపీ ప్రకటించే మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
BJP Telangana Manifesto Preparation : అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక(Telangana Formation Day)లను గ్రామగ్రామంలో ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ వర్గాలు పేర్కొననున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా 24 గంటలు ఉచితంగా సురక్షితమైన తాగునీరు, కులవృత్తులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని భావిస్తోంది. రజక, నాయిబ్రాహ్మనుల లాండ్రి, సెలూన్లకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 250 యూనిట్ల వరకు.. ఉచిత కరెంట్ అందిస్తోంది. ఆ పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు.. వర్తింప చేయాలని యోచిస్తోంది.
మెట్రోరైలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఎస్సీ కాలనీలు, మురికివాడల్లో ఆస్తి పన్ను మాఫీ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్షకులతో పాటు కౌలు రైతులకు.. రైతుబంధు, బీమా సౌకర్యం, ఫించన్ల కొనసాగింపు.. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో పారదర్శకత పాలన అందించేలా బీజేపీ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తోంది.