కాంట్రాక్ట్ నర్సులను(nurse) తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా మహిళా మోర్చా(BJP MAHILA MORCHA) డిమాండ్ చేసింది. నర్సులకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. కోఠిలోని ప్రజా వైద్యారోగ్య సంచాలకుల(Director of Public Health) కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు స్పందించకపోవడంతో గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అడ్డుకున్నారు. మోర్చా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
'తొలగించడం దుర్మార్గం'
కొవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకం అయిన నర్సులను విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం(STATE GOVERNMENT) తొలగించడాన్ని భాజపా మహిళా మోర్చా నాయకులు ఖండించారు. కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించిన నర్సులను కొనసాగించాల్సిందిపోయి... తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. నర్సులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నర్సుల తొలగింపు
గతేడాది ఏప్రిల్లో కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది కాలానికి ఔట్ సోర్సింగ్ పద్ధతిన 1640 మందిని విధుల్లోకి తీసుకుంది. మార్చి నాటికి వారి కాల పరిమితి ముగియడంతో పాటు... టీఎస్పీఎస్సీ 2017 నోటిఫికేషన్లో నర్సింగ్ స్టాఫ్ భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో వారిని విధుల్లోకి తీసుకుంటూ ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన వారిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విపత్కర కాలంలో ఏడాదిన్నర పాటు ప్రజలకు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి... తమను క్రమబద్ధీకరించాలంటూ ఔట్ సోర్సింగ్ నర్సులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: NURSES Protest: ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన నర్సులు.. ఉద్రిక్తత