హైదరాబాద్ జీహెచ్ఎంసీకి నూతన పాలకమండలి ఏర్పాటు చేయాలని భాజపా డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన భాజపా నేతల బృందం ఈ మేరకు ఫిర్యాదు చేసింది.
జీహెచ్‌ఎంసీలో సమస్యలు పరిష్కారం కావటం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుత కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారని వెల్లడించారు. ఇటీవల గెలిచిన కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ కరోనాతో మృతి చెందారని తెలిపారు. గెలిచిన కార్పొరేటర్లు ఇప్పటికీ ప్రమాణస్వీకారం చేయకపోవడం బాధాకరమన్నారు. కష్టపడి గెలిచిన ఆకుల రమేశ్ ప్రమాణస్వీకారం చేయకుండానే కన్నుమూశారని అన్నారు. ఇతర పార్టీల నుంచి కార్పొరేటర్లను తీసుకునేందుకే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దనేది తమ సిద్ధాంతమన్నారు. 2023లో ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆకాంక్షించారు.
- ఇవీ చూడండి: 4రోజుల్లో సుమారు రూ.760 కోట్ల మద్యం తాగేశారు..