BJP leaders get together meet: రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాషాయదళానికి ముఖ్యనేతల మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు సహా రాష్ట్ర సమస్యలపై పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్య నేతల మధ్య వైషమ్యాలు మంచిది కాదని భావించిన జాతీయ నాయకత్వం.. కోర్ కమిటీ సభ్యులను దిల్లీకి పిలిపించింది. వారితో సమావేశమైన జేపీ నడ్డా, అమిత్‌షా.. నేతల మధ్య విభేదాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలున్నాయని.. ఈ సమయంలో నేతల మధ్య మనస్పర్ధలు మంచిది కాదని.. పార్టీకి నష్టం చేకూరుస్తుందని సూచించినట్లు సమాచారం. అంతా కలిసి కష్టపడి పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పని చేయాలని నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం మార్గనిర్దేశం చేసింది.
అగ్ర నేతలు నడ్డా, అమిత్ షా దిశా నిర్దేశనంతో ఉప్పు, నిప్పులా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసి పని చేస్తారా.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఈ ఇద్దరూ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్య నేతలను అగ్ర నేతలు గద స్వరంతో హెచ్చరించినప్పటికీ.. ఈ ఇద్దరు కలిసి నడుస్తారా లేదా అనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అధిష్టానం మాత్రం పార్టీ నేతల మధ్య నెలకొన్న గ్యాప్‌ను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది.
అగ్ర నేతలు నడ్డా, అమిత్‌షా దిశానిర్దేశంతో నేతలంతా ఒక్కచోటకు చేరి తమ అభిప్రాయాలు పంచుకునేలా గెట్ టు గెదర్‌కు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి వారం ఒక్కో నేత ఇంటికి వెళ్లి అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటివి ఏర్పాటు చేసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఆ కార్యక్రమం వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలుత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటి నుంచే ఆ గెట్ టు గెదర్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నేతల సమన్వయ బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్‌కు అప్పగించినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున బీజేపీలోకి చేరికలు జరిగాయి. అలాంటి వారితో సమన్వయం పెరిగేలా గెట్ టు గెదర్ కార్యక్రమాలు దోహదం చేస్తాయని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇటీవల వీధి సభల విజయవంతంతో బన్సల్ తనదైన మార్క్ చూపించారు. నేతలను సమన్వయం చేయడంలోనూ బన్సల్ విజయవంతం అవుతారని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి: