రాష్ట్రంలో గిరిజనులపైనా.. భాజపా కార్యకర్తలపైనా చివరికి జర్నలిస్టులనూ సైతం వదలకుండ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ప్రజల మధ్య విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. గిరిజనుల పట్ల అడవి అధికారులు... అడవి జంతువుల కంటే క్రూరంగా, హీనంగా చూస్తున్నారని ఆక్షేపించారు. అడవి బిడ్డలు చేసిన పాపమేమి ఉందని ఆమె నిలదీశారు.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన కొందరు గిరిజనులు ఇప్ప పూల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి... రాత్రి పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోవడం వారి పాలిట శాపమైందని అన్నారు. అదేదో మహాపాపం అన్నట్లు అటవీ శాఖ సిబ్బంది ఆ గిరిజనులపై దాడి చేసి... మహిళలని చూడకుండా బూటుకాళ్లతో తన్నారని ఆవేదన చెందారు.
డిచ్పల్లి మండలం యానంపల్లి తండాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉన్న భాజపా గిరిజన మోర్చా నేతలపై తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మొన్నటికి మొన్న గుర్రంపోడు భూముల వ్యవహారంలోనూ.. తెరాస ఇదే తీరుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. గిరిజనుల భూముల్ని ఆక్రమించుకోవడమే కాకుండా ప్రశ్నించినందుకు భాజపా నేతలపై దాడులు చేయించి.. జైలుకు పంపి పైశాచికానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి: కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం