కేసీఆర్ పతనం ప్రారంభమైందని, త్వరలో తెరాస కనుమరుగవుతుందని భాజపా నేత విజయశాంతి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారని ఆమె ప్రశ్నించారు. కేసిఆర్ తెలంగాణ ప్రజలను కాకుండా... డబ్బును, పదవులను ప్రేమించారని విజయశాంతి వ్యాఖ్యానించారు. భాజపాలో చేరి తొలిసారిగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన విజయశాంతికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, స్వామిగౌడ్ ఇతర పార్టీ నేతలు స్వాగతం పలికారు. తెలంగాణ కోసం తాము ఉద్యమం చేస్తున్నప్పుడు కేసీఆర్ తెదేపాలో ఉన్నాడని విజయశాంతి పేర్కొన్నారు. తన దూకుడు చూసిన కేసీఆర్ దురుద్దేశంతో ఆలె నరేంద్రను రాయబారానికి పంపి తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ తెరాసలో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా విలీనం చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ తన కంటే గొప్ప నటుడని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను రాజకీయాల నుంచి దూరం చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించగానే అర్థరాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. భాజపా, కాంగ్రెస్ కలిస్తేనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఏమైనా కుట్రలు చేస్తే భాగ్యనగర ప్రజలు క్షమించరని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. తెరాస పాలన 2023 వరకు కొనసాగుతుందనే నమ్మకం లేదన్నారు. తెరాసలో అంతర్గత యుద్దం ప్రారంభమైందని లక్ష్మణ్ తెలిపారు.
ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'