Bjp Leader Muralidhar Rao: దేశ విచ్ఛిన్నకర శక్తులను... అవినీతిపరులను సీఎం కేసీఆర్ కలుస్తున్నారని భాజపా జాతీయ నాయకుడు మురళీధర్ రావు ఆరోపించారు. తెలంగాణలో తెరాస అవినీతి బయటపడుతుందని... అందుకే సీఎం కేసీఆర్ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో దేశ సైనిక శక్తిని ప్రశ్నించి, అనుమానించిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని అలాంటి వ్యక్తితో కేసీఆర్ కలవడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మురళీధర్ రావు పాల్గొని మాట్లాడారు. రాజకీయాలు ఏదైనా చర్చించుకోవచ్చు.. కానీ అభివృద్ధికి సంబంధించి మహారాష్ట్ర సీఎంతో ఏం చర్చలు చేశారని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ఉనికిని, దేశ ఐక్యతను తెరాస ప్రశ్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్‌ను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారన్నారు. అంటే సైనికుల శక్తిని ప్రశ్నించడమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ గాంధీకి ముల్లు గుచ్చినా కేసీఆర్ స్పందిస్తున్నారన్నారు.
ఈ మధ్య సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ గాంధీకి ముల్లు గుచ్చినా ప్రతిస్పందిస్తున్నారు. తెలంగాణలో పోటీ భాజపా, తెరాస మధ్యనే అని చెప్పకనే చెప్పావు. తెరాస అవినీతి బయటపడుతుందని దీని దృష్టి మరల్చేందుకు రాష్ట్రాల పర్యటన కేసీఆర్ ప్రారంభించారు.
-- మురళీధర్ రావు, భాజపా నేత
కాంగ్రెస్ చరిత్ర కళంకమైన చరిత్ర అని మురళీధర్ రావు అన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. దిల్లీ రాజకీయాలు చేయాలంటే... ముందు తెలంగాణలో విజయం సాధించాలని హితవు పలికారు. కేసీఆర్ గతంలో కూడా ఫెడరల్ ఫ్రంట్ అన్నారని... అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసని చురకలంటించారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారన్నారు. గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి మురళీధర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Shiv sena Mp on KCR: అందరినీ ఏకంచేసే సత్తా కేసీఆర్‌కు ఉంది: శివసేన ఎంపీ రౌత్