BJP Leader Laxman on BC Sabha : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ(BJP Form Govt BC Candidate Will CM)ని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని.. బీఆర్‌ఎస్ పశ్చాత్తాప పడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్(K Laxman) ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రకటించిన 88మంది అభ్యర్థుల్లో 31మంది బీసీలకే టికెట్లు ఇచ్చిందని వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్(BC Sub Plan in Telangana) తీసుకువస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. బీసీ సభ గురించి వివరాలు తెలిపారు.
బీసీలు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని రాహుల్ గాంధీ హేళన చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సమయంలో బీసీ సమాజం తరలివచ్చి.. సత్తా చాటాలని కోరారు. బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ బీసీలను అన్ని విధాలుగా అణచివేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది బీసీలకు ఉద్యోగం, ఉపాధి లేదని తెలిపారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు బీసీల అభ్యున్నతి కోసం కమిషన్లు వేసిందే లేదని గుర్తు చేశారు.
BC Sub Plan if BJP Comes to Power in Telangana : బీసీల పట్ల కాంగ్రెస్ ముసలి కన్నీరు కారుస్తోందని.. బీసీ సాధికారతకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బీసీ ఆత్మ గౌరవ సభ ద్వారా బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే భరోసా కల్పిస్తారన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ(SC Classification)పై ఈ నెల 11న సభ ఉంటుందన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ విచ్చేయనున్నారని తెలిపారు.
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన(PM Modi Telagnana Tour) ఖరారైంది. ఈ నెల 7న రాష్ట్రానికి ప్రధాని రానున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సభలో పాల్గొననున్నారు. బీసీ సభలో పాల్గొనేందుకు ప్రధాని దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:05 గంటలకు బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. 5:30 నుంచి 6: 10వరకు బీసీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. సభ ముగించుకుని సాయంత్రం 6:35 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీ పయనంకానున్నారు. అక్కడ నిర్వహించే సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లను బీజేపీ ప్రతినిధి బృందం పరిశీలించింది.
తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం