రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరోనా కట్టడిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వందల మంది ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, పాత్రికేయులు ఈ వైరస్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో కరోనా విస్తృతి మరీ ఎక్కువగా ఉందన్న ఆయన.. లాక్డౌన్ సమయంలోనే అందరికీ పరీక్షలు నిర్వహిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని.. ప్రజల ప్రాణాలు రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్‌ను ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం.. దాని నిర్వహణను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇదీచూడండి: మంత్రి కుటుంబంలో కరోనా.. భార్య, కూతురికి పాజిటివ్