ఐటీఐఆర్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్ మండిపడ్డారు. నివాసయోగ్యమైన నగరాల జాబితాలో 4వ స్థానంలో ఉన్న భాగ్యనగరం 24కు పడిపోవటం కేటీఆర్ అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాలేదని హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టభద్రులు తగిన బుద్ధి చెబుతారన్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రం పథకాలను అమలు చేయటం లేదని ఆరోపించారు. ఐపీఎల్ హైదరాబాద్‌కు రాకపోవడానికి కారణం స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమేనని విమర్శించారు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత తెరాస నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముద్ర లోన్స్‌పై అవాస్తవాలు చెబుతున్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వివేక్ తెలిపారు.