దిల్లీలో భాజపాను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాపూజీనగర్‌లో అక్షర, అప్స స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత శిక్షణ కేంద్రాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా త్వరలో రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో సీఏఏకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు.