BJP Janasena Alliance in Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్ షాను కలిసి సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు.
Amit shah Advice To Kishan reddy and Pawan Kalyan : విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాను శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్ షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నది చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో.. కిషన్‌రెడ్డి, పవన్ కల్యాణ్‌లు భేటీ కావాలనుకున్నా ఆయన మరో సమావేశంలో ఉండటంతో కలవలేకపోయారు. గతంలో పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) హైదరాబాద్‌లో ప్రాథమికంగా చర్చించామని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుదామని ఆయన అనడం వల్లే ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి అని.. అంతవరకే తమ చర్చలు ఉంటాయని కిషన్‌రెడ్డి వివరించారు.
Telangana Assembly Elections 2023 : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు కిషన్‌రెడ్డి (Kishan reddy) వివరించారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
"హైదరాబాద్‌లో ప్రాథమికంగా కలిశాం. కాసేపు ఇద్దరూ చర్చించాం. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుదామని ఆయన అనడం వల్లే ఆహ్వానించాం. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతవరకే మా చర్చలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఈ సమావేశంలో అమిత్ షా, పవన్ కల్యాణ్‌లు ప్రత్యేకంగా ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్ కల్యాణ్ వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తున్న విషయం అమిత్ షా వద్ద చర్చకు రాలేదని.. తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది.