Bjp High Command Green Signal to New State Executive Committee: కాషాయ పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్'తో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు అసంతృప్తి నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తమకు మంచి అవకాశాలు, పదవులు దక్కుతాయని భారీ అంచనాలు పెట్టుకున్నారు. చేరి చాలా కాలమైనా ఉత్సవ విగ్రహాల్లాగే మిగిలిపోయామనే ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తాజాగా హైకమాండ్ నుంచి రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రస్తావన రావడంతో అసంతృప్తిగా ఉన్న వారిలో ఆశలు మొలకెత్తాయి. తమకు ఈసారి అవకాశాలు దక్కుతాయని ఇతర పార్టీల నుంచి కమలం గూటికి చేరిన నేతలు ఆశిస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ: మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, కూన శ్రీశైలం గౌడ్, విక్రమ్ గౌడ్ వంటి నేతలు కాషాయతీర్థం పుచ్చుకుని చాలా రోజులవుతోంది. ఈ నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చోటిచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు, చేర్పులంటూ జరగుతున్న ప్రచారం పట్ల పలువురు బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయని నేతలను పక్కన పెట్టేయాలని జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక తమ ఆటలకు చెక్ పడనుందని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాషాయ దళం బీఆర్ఎస్కు చెక్ పెట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు.
కొత్త కార్యవర్గం తరువాత బీజేపీ బండి మరింత పరుగులు తీస్తుందా: ప్రజలకు చేరువ కావడం, ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టడం వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అగ్ర నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. మే నుంచి మరింత రాజకీయ వేడిని పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరించేందుకు హైకమాండ్ సైతం సిద్ధంగా ఉంది. కొత్త జట్టును బండి సంజయ్ ఎప్పుడూ ప్రకటిస్తారు. ఎవరెవరికి తన జట్టులో చోటు కల్పిస్తారు. కొత్త కార్యవర్గం తరువాత బీజేపీ బండి మరింత పరుగులు తీస్తుందా... పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందా అనేది వేచి చూడాలి.
ఊపందుకోనున్న నేతల రాజకీయ వలసలు: మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నేతల రాజకీయ వలసలు ఊపందుకోనున్నాయి. పార్టీలో ఇమడని నేతలను బీఆర్ఎస్ బయటకు పంపుతోంది. దాంతో కొందరు నేతలు అవకాశాల కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అధికార గులాబీ పార్టీలో తమకు ఇక అవకాశం లేదన్న భావనకు వచ్చిన నేతలు... బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకొని రాజకీయ భవిష్యత్ దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: