రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. కమలనాథులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి జీహెచ్ఎంసీ వరకు అనుకూల ఫలితాలు రావడం వల్ల జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దక్షిణ భారతంలో కేవలం కర్ణాటకలోనే అధికారంలో ఉన్న భాజపా.. రాష్ట్రంలోనూ పార్డీ జెండా ఎగరవేసేందుకు అనుకూల పరిస్థితులున్నాయని కమలనాథులు యోచిస్తున్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని.. ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పేర్లు ఖరారు..
ఈ క్రమంలో మార్చిలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాంచందర్‌రావుకే తిరిగి కేటాయించింది. వరంగల్-నల్గొండ-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి వారిపేర్లనే జాతీయ నాయకత్వానికి రాష్ట్ర శాఖ పంపించింది.
కోదండరాంను ఎదుర్కొనేలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో అదే జోరును రెండు పట్టభద్రుల స్థానాల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఐతే వరంగల్-నల్గొండ-ఖమ్మం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతుండడం వల్ల ప్రేమేందర్‌రెడ్డి కాకుండా మరో బలమైన వారిని దింపాలని యోచిస్తోంది. ప్రేమేందర్‌రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించారు.
బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ..
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఆరు నెలల్లోగా ఆ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. అక్కడా విజయం సాధించి అధికార తెరాసను గట్టిగా దెబ్బతీసేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీని ఎదుర్కొనే బలమైన అభ్యర్థి కోసం.. భాజపా అన్వేషిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కుమారుడిని పార్టీలోకి రప్పించి బరిలోకి దించాలని భావిస్తోంది. ఈ మేరకు జానారెడ్డి, ఆయన కుమారుడితో సంప్రదింపులు చేస్తోంది. ఐతే వారి చేరికపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
పార్టీలో చోటు కల్పించి..
తెరాస నోముల నరసింహయ్య కుటంబ సభ్యులకు టికెట్ కేటాయిస్తే తెరాస నేత కోటిరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ కోటిరెడ్డికి తెరాస టికెట్ కేటాయిస్తే నోముల కుటుంబసభ్యులను చేర్చుకొని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఈనెల 11న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. నర్సింహయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నకిరేకల్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు పట్టభద్రుల స్థానాలతోపాటు నాగార్జునసాగర్‌లో గెలిస్తే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయానికి దోహదం చేస్తాయని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: '5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని... రెండేళ్లయినా పత్తా లేదు'