BJP Election Plan Telangana 2023 : దక్షిణాదిలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన భారతీయ జనతా పార్టీ... తెలంగాణలో పాలనను దక్కించుకుని ప్రభావాన్ని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా.. ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని... కాషాయ దళానికి దిశానిర్దేశం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని.. ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వరకు... బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం బయటపడిందని విమర్శించారు. లీకేజీలతో 30 లక్షల మంది యువత ఆకాంక్షలను చిదిమేశారని ఆగ్రహించారు. ఇలాంటి ప్రభుత్వానికి శాశ్వతంగా సెలవు ఇవ్వాలన్నారు.
JP Nadda Fires on BRS : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో.. కుటుంబ పాలన అంతం కావడం ఖాయం: జేపీ నడ్డా
JP Nadda Comments on BRS : దేశంలో ఏకైక జాతీయ పార్టీ బీజేపీ మాత్రమేనని నడ్డా స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోరాడుతోందన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీలు పుట్టుకువచ్చేందుకు కారణమైందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆర్జేడీ, జేఎంఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, వైకాపా.. ఇలా అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయన్నారు. ఏపీలో వైఎస్సార్, జగన్‌రెడ్డి కుటుంబం.. తెలంగాణలో కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు.. ఇలా కుటుంబాల అధీనంలోనే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి గత తొమ్మిదేళ్లలో కేంద్రం రూ.9 లక్షల కోట్లు వ్యయం చేసిందని వివరించారు.
BJP Plan For Telangana Assembly Elections 2023 : ప్రధాని మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సాధనలో మొదటిసారి 369 మంది, రెండో విడతలో 1200 మంది మరణాలకు కాంగ్రెస్ కారణమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో పింఛను డబ్బులిచ్చి... మరో చేత్తో మద్యం అమ్మకాలతో లాక్కుంటుందోని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వ్యూహాత్మంగా ఓటర్లుగా చేర్చి... గెలిచేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ.. ఎంఐఎం అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్లో చేరిపోతారంటూ.. జోస్యం చెప్పారు.
రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల వేదికగా.. ఎన్నికలకు సంబంధించిన బీజేపీ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుంది. ఈ సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. 60 రోజుల ఎన్నికల ప్రణాళికతో బీజేపీ ముందుకు సాగనుంది. 20 రకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. 8వ తేదీన పసుపు బోర్డ్, ట్రైబల్ వర్సిటీ, కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 9, 10, 11 తేదీల్లో మేరా మాటి మేరీ దేశ్‌లో భాగంగా అసెంబ్లీ కేంద్రాల వారీగా మట్టి సేకరణ చేపట్టనుంది.
10 నుంచి 31వ తేదీ వరకు 38 జిల్లాలో పబ్లిక్ మీటింగ్స్‌కు ప్లాన్ చేసుకుంది. ప్రధాని విశ్వకర్మ యోజన కోసం 3 లక్షల మందిని గుర్తించి 3 లక్షల ఋణాలు ఇప్పించడంతో వారికి చేరువకావడంపై దృష్టిపెట్టింది. 15న బీజేపీ మేనిఫెస్టోపై ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టాలని యోచిస్తోంది. 11న గిరిజన ప్రాంతాల్లో గిరిజన యూనివర్శిటీ అమలుపై వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 13 నుంచి 20వ తేదీ వరకు అసెంబ్లీ స్థాయి సమావేశాలు, సోషల్ మీడియా, మేధావులతో సమావేశం కావాలని నిర్ణయించింది. 26 నుంచి అన్ని మోర్చాలు కలిసి డోర్ టూ డోర్ వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని కౌన్సిల్ సమావేశంలో మార్గనిర్దేశనం చేశారు. ఈ 60 రోజుల్లో మొత్తం 43 బహిరంగ సభలకు ప్రణాళికలు చేసుకుంది. జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపనుంది. ప్రధాని మోదీతో మరో మూడు సభలు నిర్వహించాలని భావిస్తోంది.
Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్