కరోనా వైరస్ ప్రస్తుతం ప్రతిబంధకంగా మారినప్పటికీ... దాన్ని పరిష్కరించటం కోసం కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఫార్మా రంగానికి అవకాశాలను ఇస్తున్నామని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న బయో ఏషియా-2020 సదస్సులో సీఈఓ ఎన్‌క్లేవ్‌కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన హాజరయ్యారు. నోవర్టీస్ సీఈఓ వ్యాస్ నరసింహన్‌కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును అందించారు. అనంతరం జరిగిన చర్చలో పాల్గొన్నారు.
అభినందించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్‌ను ఫార్మాకు గమ్య స్థానంగా మార్చాలాన్న ఉద్దేశంతో ఇలాంటి సదస్సు నిర్వహించటం అభినందనీయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.. ఫార్మా రంగం మొత్తం మరో స్థాయిలో అంతర్జాతీయ సాంకేతికతలతో, దేశీయ పరిశోధనలతో ఏవిధంగా పనిచేయాలో చూడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోనే పనిచేసే వారు ఎక్కువున్న దేశంగా భారత్ మూడేళ్లలో అవతరిస్తుందని చెప్పారు. ధరల నియంత్రణ వైద్యాన్ని అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చిందని అన్నారు. మార్చి రెండో వారంలో ఫార్మా ప్రతినిధులతో సమావేశమవుతామని వెల్లడించారు.
ఇవాళ్టితో ముగియనున్న సదస్సు
హైదరాబాద్.. నోవార్టిస్, ఫేస్బుక్, గూగుల్ తదితర అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతోన్న టీకాల్లో 35 శాతం హైదరాబాద్‌లోనే అవుతున్నాయని పేర్కొన్నారు. అవకాశాలను ఉపయోగించుకోకుంటే చైనా తదితర దేశాలతో పోటీపడలేమని అన్నారు. ఈనెల 17 ప్రారంభమైన బయో ఏసియా సదస్సు... ఇవాళ్టితో ముగియనుంది.
ఇవీ చూడండి: నోవార్టిస్ సీఈవోకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు