దిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నగర శివారు మేడిపల్లి, ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. 1500 పరిశ్రమలు ఒకే చోటికి తరలించడం వల్ల వెలువడే కాలుష్యం భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దగ్గరలోని చెరువులు, అటవీ ప్రాంతం, భూమి, నీరు, గాలి అన్ని కలుషితమవుతాయని... ఈ పరిశ్రమల ప్రభావం వంద కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పేద రైతుల వద్ద పంటలు పండే భూమిని ఎకరా ఎనిమిది లక్షలకు బలవంతంగా లాక్కుని... అదే భూమిని ఎకరా కోటిన్నర రూపాయలకు పరిశ్రమలకు కేటాయిస్తుందని ఆరోపించారు.
ప్రస్తుతం మూడు వేల ఎకరాలుగా పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్లో 19 వేల ఎకరాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ ఫార్మాసిటీ ఏర్పాటు ద్వారా స్థానికంగా కొత్తగా ఉద్యోగ, ఉపాధి వస్తాయని ఎక్కడ స్పష్టం చేయలేదని తెలిపారు. ఫార్మాసిటీ వల్ల ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, చిట్యాల తదితర ప్రాంతాలు కాలుష్యం బారిన పడతాయన్నారు.
ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత