Bhogi Celebrations 2022: తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి. మూడ్రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి. ఇళ్లముందు వేసే భోగి మంటలతో.. సందడి మొదలైంది. చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతీ లోగిలిలో నులివెచ్చని కాంతికిరణాలు భోగిమంటల రూపంలో ప్రసరిస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలను ఒకచోట వేసి..మంటలు వేస్తారు. ఇరుగుపొరుగు, చుట్టాలు పక్కాలు అంతా చుట్టూచేరి చలి మంటలు కాచుకుంటారు. ఆ నులివెచ్చని మంటలు వేకువ బద్ధకంతోపాటు మదిలోని నిరాశా నిస్పృహలనూ వదిలించే జ్వాలా తోరణాలు.
సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరిరోజు భోగి ! దక్షిణాయనంలో..ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. పాత ఆలోచనల్ని వదిలించుకుని... కాలంతోపాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేసుకుంటారు. భోగిమంటలయ్యాక ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు. ఆనవాయితీగా పులగం తింటారు. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి వండే.. వంటకమే పులగం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పులగం.. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. అందుకే నేటితరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి.. మేం తినం అని మారాం చేసినా..పెద్దవాళ్లు దాని విశిష్టతను చెప్పి తినిపిస్తారు.
పిల్లలకు భోగి పళ్లు
భోగిపండుగ మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్లు పోయడం. ఎర్రటి సూర్యుడి రంగు, గుండ్రటి ఆకారాన్ని పోలిన రేగుపళ్లను చిన్నారులపై పోస్తే మేథాశక్తి వస్తుందని పండితులు ప్రవచిస్తుంటారు. రేగు పళ్లతోపాటు, పూలరేకులు, చిల్లర నాణేలు కలిపి 3 సార్లు సవ్య, అపసవ్య దిశలో తిప్పి... పిల్లల తలపై పోస్తారు. ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా.. కలిపిపోస్తున్నారు. అలా చేస్తే పిల్లలకుండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఏకాలంలో దొరికే పండ్లు.. ఆ కాలంలోనే తినాలి. ఇప్పుడు మాత్రమే దొరికే రేగుపళ్లలోని గుజ్జుతింటే.. పిల్లలకు అజీర్తి, మలబద్ధకం కూడా పోతుంది. తద్వారా ఆరోగ్య శక్తి లభిస్తాయని విశ్వాసం.!
భోగినాటి సందడిలో మరొకటి బొమ్మల కొలువు. ఎప్పట్నుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేస్తారు. వాటిని వరుసలో చేరుస్తారు. కొందరు పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గ్లోబుపై ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారంతా భోగి వేడుక జరుపుకుంటారు. కాకపోతే.. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే ప్రతిచోటా భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా వేస్తారు.
ఇదీ చదవండి: లోహ్రీ వేడుకల్లో జవాన్లు- నృత్యాలు చేస్తూ సంబరాలు