భోగి పర్వదినాన్ని భాగ్యనగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామే భోగి మంటలు వేసి సందడి చేశారు. బంజారాహిల్స్, బోయిన్‌పల్లి న్యూ సిటీ కాలనీ, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, లింగంపల్లిలోని పలు కాలనీల్లో ఉదయాన్నే ఇంట్లోని పనికిరాని చెక్కలు, పిడకలు, కట్టెలను భోగి మంటల్లో వేసి వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
రంగురంగుల గాలిపటాలతో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మైదానానికి చేరుకుని గాలి పటాలు ఎగురవేశారు. పండుగల వేళ ఆచారాలు పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంత్రి ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్ పార్సిగుట్టలో కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
సంక్రాంతి సంబురాల్లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్: యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సంక్రాంతి సంబురాల్లో సందడి చేశారు. సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ దీపికారెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో శిల్పారామం ప్రాంతంలో పండగ వాతావరణం సంతరించుకొంది.
సంక్రాంతి సంబురాల్లో బండి సంజయ్ దంపతులు: మంచిర్యాలలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి.. మంచిర్యాల వాకర్ అసోసియేషన్ సభ్యులు సందడి చేశారు. నిజామాబాద్‌లోని పెద్ద రామ మందిరం ఆవరణంలో.. బీజేపీ మహిళా మోర్చ అధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. డిచ్‌పల్లి మండలంలో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. మహాశక్తి ఆలయంలో గోదా రంగనాయకుల కల్యాణం వైభవంగా జరిగింది.. వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దంపతులతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బొమ్మల కొలువు ఏర్పాటు: హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా భోగి పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఖాజీపేటలోని బాలవికాసలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో విదేశీయులు పాల్గొని సందడి చేశారు. ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. గంగిరెద్దు ఆటలతో సందడిచేశారు. హనుమకొండలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సతీమణి సరోజినిదేవి తన నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ములుగులోని రామాలయంలో గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం ఘనంగా జరిగింది.
నల్గొండలోని వేడుకల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా పండుగ వేడుకలు నిర్వహించారు. పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై భోగిపండ్లు పోశారు. మేళ్లచెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా.. 350 కలశాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఇవీ చదవండి: