పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వాస్తవానికి దూరంగా 2020-21 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారని విమర్శించారు. అప్పులు, మద్యంలో అభివృద్ధి కనిపిస్తోందని భట్టి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. దిశ, సమత వంటి ఘటనలు మద్యం వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. పేదల కోసం నిర్మించిన రాజీవ్ స్వగృహను వ్యాపారంగా మార్చకూడదన్నారు. రెండుపడక గదుల ఇళ్ల పథకంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
ఇంటిస్థలం లేని వారికి భూములు కేటాయించాలి
గ్రామాల్లో ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శివార్లలోని భూములను పరిశ్రమలకు కేటాయించాలని... పరిశ్రమలు అంటే కేవలం ఐటీ మాత్రమే అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఐటీ రంగం దానంతటదే అభివృద్ధి చెందుతోందని... ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలను అభివృద్ధి చేస్తే ఉపాధి పెరుగుతుందని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పౌల్ట్రీస్‌పై ఆధారపడి బతుకుతున్నారని వెల్లడించారు. సామాన్య, మధ్యతరహా రైతులకు అందింది ఏమీ లేదని భట్టి ఆరోపించారు.
విద్య, వైద్యంపై దృష్టి సారించాలి
విద్య, వైద్యం మీదనే ఎక్కువ ఖర్చు పెట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు లేరని... ఎప్పటిలోపు నియమిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. వర్సిటీల్లో సరైన వసతులు, శుభ్రత లేవని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: 'సమస్యలు పరిష్కరించమంటే... చితకబాదుతారా?'