Bhatti Vikramarka fires on KCR : నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పాలన.. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు దౌర్భాగ్యపాలనగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రజలు ఏమైనా ఫర్వాలేదని అనుకుంటోందని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో దళిత ,గిరిజన, మైనారిటీ బలహీన వర్గాలు 92 శాతం ఉన్నారని భట్టీ పేర్కొన్నారు. చంద్రశేఖర్‌రావు సీఎం కావడానికి మొదటి దళిత ముఖ్యమంత్రి అని కలల ప్రపంచం సృష్టించారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామని.. ఇవేవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు కోసం రూ. 17,700 కోట్ల లెక్కలు చూపించారు. ఆచరణలో మాత్రం కనీసం 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బోనాధ్ మండలంలో రమాకాంత్ అనే వ్యక్తి.. దళిత బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడని అతని ఆత్మహత్యకు కేసీఆరే కారణమంటూ లేఖ రాసి చనిపోయారని పేర్కొన్నారు. కేసీఆర్ రాజ్యాధికారం కోసం ఇంకా ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారని ప్రశ్నించారు. దళితుల అభవృద్ధికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.
తెలంగాణ కోసం బలహీనవర్గాలు కన్న కలలు నెరేవేరలేదని.. కాంగ్రెస్ మాత్రమే అణగారిన వర్గాల కలలు నిజం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ పాలన పోయి.. ప్రజల తెలంగాణ పాలన తీసుకొస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారన్నారు. దళిత గిరిజన కుటుంబాలు.. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని.. వచ్చేది హస్తం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Bhatti Responds on YS Sharmila decision : దళిత గిరిజన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. రమాకాంత్ సూసైడ్ నోట్‌పై విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు, అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మద్ధతివ్వాలంటూ వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకురాలు.. వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీతో కలసిరావడం శుభపరిణామమన్నారు.
"నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన.. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు దౌర్భాగ్యపాలనగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రజలు ఏమైనా పర్వాలేదని అనుకుంటోంది. తెలంగాణ కోసం బలహీనవర్గాలు కన్న కలలు నెరేవేరలేదు.. కాంగ్రెస్ మాత్రమే అణగారిన వర్గాల కలలు నిజం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలంటూ వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకురాలు.. వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము". - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత