Bhatti Vikramarka on GO 317: ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడేందుకే తెరాస ప్రభుత్వం 317 జీవో తెచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బదిలీల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికతకు పాతరపెట్టి 317జీవో ద్వారా బలవంతపు బదిలీలు చేయడం వల్ల మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు సంధ్యాతండాకు చెందిన బానోతు జేతురామ్ గుండెపోటుతో చనిపోయారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ హత్యగా తాము భావిస్తున్నామన్న ఆయన.. ఆ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. జేతురామ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల కేటాయింపుల విషయంలో ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలే ఉద్యోగి మృతికి కారణమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది..
రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఇదేవిధంగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చిందని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేయకుండా, అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఇష్టారాజ్యంగా 317 జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. సీనియారిటీ, స్థానికత, మెడికల్ గ్రౌండ్, స్పౌజ్, విడో అంశాలను పరిగణలోకి తీసుకోకుండా బదిలీలు చేస్తుండడంతో రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారిందని ఆరోపించారు. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే వారిని ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 317 జీవో సవరించి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని, ఎవరూ దిగులుపడొద్దని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
Oppositions on GO 317: 'జీవో 317తో స్థానికులే స్థానికేతరులుగా మారే ప్రమాదముంది'