Telangana Budget Sessions 2023-24 : బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ ప్రారంభమైంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. మొదటగా.. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.
MLA Akbaruddin fires on Center : కేంద్రప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటోందని ఓవైసీ ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్.. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదని తెలిపారు. బడ్జెట్ అంచనాల్లో 20 శాతం లోపు మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తోందని వెల్లడించారు. మిగులు బడ్జెట్ ఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కల వల్ల... రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కచ్చితమైన లెక్కలు చూపి...రెవెన్యూలోటు నిధులు పొందాలని సూచించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి అప్పులు చేస్తున్న కేంద్రం... తెలంగాణపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు.
''ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అనేది కేంద్రం, రాష్ట్రాలకు సమానంగా వర్తించాలి. కానీ భాజపాయేతర పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రుణపరిమితిపై భాజపా ఆంక్షలు విధిస్తోంది. కేంద్రం ప్రతిరోజూ రూ.4,895.38కోట్లు అప్పులు చేస్తోంది. ప్రతిరోజూ కేంద్రప్రభుత్వం రూ.2,958.82కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. అయినా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అప్పులపై మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. తెలంగాణకు రావాల్సిన వాటా చెల్లించకుండా వారు(కేంద్రం) రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారు.'' - అక్బరుద్దీన్, ఎంఐఎం సభ్యుడు
Bhatti fires on Center : ఒక పార్టీ భారత్‌లో రెండు దేశాలను సృష్టిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెండుగా విభజిస్తున్నారని వెల్లడించారు. పేదలు పేదలుగానే ఉంటే.. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని తెలిపారు. ఈ దేశం దోపిడీకి గురవుతోందని జోడోయాత్రలో రాహుల్‌గాంధీతో ప్రజలు అన్నారని వెల్లడించారు. అదానీ అనే వ్యాపారి దేశసంపదను లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇండియా అంటే అదానీ అన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ తప్పులు బయటపెడితే భారత్‌పై దాడి అంటున్నారని తెలిపారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రధానులు భారీ పరిశ్రమలు నెలకొల్పారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మోదీ సర్కారు అమ్ముతోందని ఆరోపించారు. గతంలో విమానాశ్రయాల టెండర్లలో మేలైన నిబంధనలు ఉండేవి అని వివరించారు.
''అనుభవం లేని వారికి విమానాశ్రయాల టెండర్లు ఇచ్చేవారు కాదు. అదానీ కోసం టెండర్ల నిబంధనలను సవరించారు. భారత్‌ను బలవంతంగా నిలిపేందుకు అంబేడ్కర్ అద్భుత రాజ్యాంగం అందించారు. కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో ఇప్పటివరకు తేల్చలేదు. సాగర్ ఎడమ కాలువకు నీరు రాకపోతే.. ఖమ్మం జిల్లాకు తీవ్ర నష్టం. కొత్త ప్రాజెక్టులు సాధించకపోతే ఉన్న ప్రాజెక్టులనైనా కాపాడాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చెంత, ఎత్తి పోసిన నీరెంత? రుణమాఫీకి తక్కువ నిధులు కేటాయించారు, ఈసారైనా రుణమాఫీ పూర్తి చేయాలి.'' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
పేదలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ పేదల కోసం ప్రభుత్వం గృహాలు నిర్మించాలని కోరారు. విద్యార్థుల నెలవారీ మెస్ బిల్లులను రూ.3 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ఎత్తేస్తున్నాయని వెల్లడించారు.
పేదలు ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలను పాటించటం లేదని ఆరోపించారు. హైస్కూల్ స్థాయి విద్యకే రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలకు సరైన భవనాలు లేవని వివరించారు. ఒకే గదిలో తరగతులు, హాస్టల్‌ను నిర్వహిస్తున్న దుస్థితి ఉందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: