స్వదేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. మంగళవారం మరికొంతమంది వాలంటీర్లకు వైద్యులు స్క్రీనింగ్ చేశారు.
వారి రక్త నమూనాలు సేకరించి.. వివిధ రకాల పరీక్షలు చేశారు. ఈ నివేదికను ఐసీఎంఆర్‌కు పంపించనున్నారు. తొలిదశ మానవ ప్రయోగాల్లో భాగంగా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
వారిని ఐసీయూలో ఉంచి 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మంగళవారం డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
అంతకుముందు వారి రక్త నమూనాలను సేకరించి దిల్లీలోని సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. క్లినికల్ ట్రయల్స్‌కోసం ఇప్పటికే 60మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.
ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. వాలంటీర్ల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఐసీఎంఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపిస్తున్నట్లు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.