ప్రజల ఆరాధ్య దైవమైన వినాయకుడి విగ్రహానికి పార్టీ కండువా కప్పిన వారిపై కేసు నమోదు చేయాలని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాశ్ చందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని లక్ష్మీ గణపతి దేవాలయం ముందు భజరంగ్‌దళ్, భాజపా, కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు.
హైందవ సమాజాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ అమలులో ఉందని... ఆలయం వద్ద నిరసన చేపట్టరాదని సూచించారు. దీనితో భజరంగ్‌దళ్, భాజపా, కాంగ్రెస్ నేతలు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. పార్టీ కండువా కప్పిన వారిపై భజరంగ్‌దళ్ నాయకులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గాంధీనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి ముఠా పద్మ నరేశ్ నామినేషన్‌కు వెళ్లడానకిి ముందు ఎమ్మెల్సీ కవితతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లక్ష్మీ గణపతి దేవాలయానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో వినాయక విగ్రహానికి తెరాస కండువా కప్పి తమ మనోభావాలను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలను రాజకీయ పార్టీల రంగులతో అబాసుపాలు చేయవద్దని డిమాండ్ చేశారు.