రాజధానిలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా వైద్యం అందించే విషయంలో మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తుండటంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో పడకలు దొరకని నేపథ్యంలో మిగిలిన మధ్య తరహా ఆస్పత్రులు ఈ డిమాండ్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. కరోనా రోగి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఇంత చెల్లిస్తేనే పడక కేటాయిస్తామంటూ బేరాలు పెడుతున్నాయి. అంతా చెల్లించినా కూడా సంబంధిత రోగి బతికి బట్టకడుతున్నాడా అంటే అదీ లేదు. చివరి దశలో ఇటువంటి రోగులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నాయి. గాంధీ వైద్యులు కొన ఊపిరితో ఉన్న రోగులను కూడా చేర్చుకుంటున్నా.. కొద్దిగంటలకే సంబంధిత వ్యక్తి చనిపోతున్నారు. దీని ఆధారంగా కొవిడ్ మృతుల విషయంలో కొంతమంది తమపై బురద జల్లుతున్నారని గాంధీ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడైతే బతుకుతాడంటూ..
కొవిడ్‌ను ఆసరాగా చేసుకొని దోచుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈసారి వాటి ఆగడాల మీద సర్కారు దృష్టిపెట్టకపోవడంతో దోపిడీకి అంతులేకుండా ఉంది. ఎల్బీనగర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుత డిమాండ్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. ఐసీయూలో ఉంచాలంటే రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నాయి. రోగి దగ్గర ఉన్న డబ్బంతా వసూలు చేసి.. తరువాత గాంధీకి తరలించండని బంధువులకు సలహా ఇస్తున్నారు. అక్కడైతే బతుకుతాడని చెప్పి.. చేతులు దులుపుకొంటున్నారు. కరోనా పేరుతో చేరిన రోగులు చనిపోతే ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందన్న స్వార్థ ఆలోచనతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇలా చేస్తున్నాయి.
నెలరోజుల్లో గాంధీకి 170 మంది రోగులు!
నెలరోజులుగా ఇతర ప్రైవేటు ఆస్పత్రుల నుంచి 170 మందికిపైగా కొవిడ్ రోగులు గాంధీలో చేరారు. ఇలా చేరిన వారిలో 125 మంది చావు బతుకుల మధ్యే వచ్చారు. ఈ రోగులకు అంతకుముందే వివిధ రకాల వ్యాధులున్నాయి. వీరిలో వందమందికిపైగా చేరిన నాలుగు గంటల్లో కొంతమంది, ఆరేడు రోజుల్లో మరికొంతమంది చనిపోయారు. వీరందరినీ ఐసీయూలో చేర్చి చికిత్స అందించినా అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగి చనిపోతున్నారని గాంధీ వైద్యులు చెబుతున్నారు. దీనిపై తాము ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో 1359 కేసులు
కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1359 కేసులు నమోదవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 598 మంది వైరస్ బారిన పడగా, మేడ్చల్ జిల్లాలో 435, రంగారెడ్డిలో 326 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వైద్యాధికారులు చెబుతున్నారు. మూడు జిల్లాల్లో కలిపి గత వారం రోజుల్లో ఏకంగా 7,345 మంది మహమ్మారి బారిన పడ్డారు. గత మూడు రోజులుగా రోజూ వెయ్యికి పైగా నమోదవుతున్నాయి.
ఆఖరి నిమిషంలో వస్తున్నారు
ఇటీవల కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నుంచి గాంధీకి వచ్చిన కరోనా రోగుల్లో 90 శాతం ఆఖరి దశలో వచ్చినవారేనని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇందులో కొందరు కొన ఊపిరితో వచ్చిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో కొందరు చికిత్స మొదలుపెట్టకముందే చనిపోతున్నారని వెల్లడించారు. చాలామందికి అప్పటికే వివిధ రకాల అవయవాలు పని చేయడం లేదని పేర్కొన్నారు. తమ దగ్గరకు వచ్చిన రోగులందరిని చేర్చుకుంటున్నామని... పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా ఉన్నా వారిని ఐసీయూలో చేర్చి వారి ప్రాణాలను నిలుపుతున్నామని స్పష్టం చేశారు. ఇలా బతికి బట్టకట్టిన వారు ఎంతోమంది ఉన్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'