భిక్షాటన చేసేవారే చిన్నారులను అపహరించి యాచక వృత్తిలోకి దింపుతున్నట్లు ఇటీవలి ఘటనల ద్వారా స్పష్టమవుతోంది. పోలీసులు ఇటువంటి వారి చెర నుంచి నలుగురు బాలలను రక్షించారు. ఫలక్‌నుమాలో ఓ చిన్నారిని రక్షించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఓ యాచకుడు చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చిన్నారి ద్వారా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే ఈ పని చేసినట్లు విచారణలో తెలిపాడు.
సైఫాబాద్‌లోనూ ఈ తరహా కేసు నమోదైంది. ఏసీ గార్డ్స్ ప్రాంతంలో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ సైఫాబాద్‌లో లభ్యమైంది. పోలీసులు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. గత మేలో పాదబాటపై తల్లితో పాటు పడుకున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లారు. కాలాపత్తర్‌లో పోలీసులు నిందితులను పట్టుకుని చిన్నారిని రక్షించారు.
ట్విటర్‌లో నెటిజన్ల ఆగ్రహం
ప్యారడైజ్ జంక్షన్‌లో చిన్నారులు భిక్షాటన చేస్తున్న చిత్రాలను రాబిన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేసి ‘యాచక రహిత నగరం’ అన్నారు.. ఈ చిన్నారులు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ కూడలిలో చూసినా వారే కనిపిస్తున్నారంటూ కేటీఆర్, పోలీస్ విభాగం, తెలంగాణ డీజీపీల ట్విటర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెగ్గింగ్ మాఫియాను అరికట్టలేరా అంటూ అధికారులను ప్రశ్నించారు.
యాచక రహితం సాధ్యమేనా?
యాచక రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సాకారమౌతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏ జంక్షన్‌లో చూసిన చిన్నారులు భిక్షాటన చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. యాచకులకు పూర్థి స్థాయిలో పునరావాసం కల్పించడమే కాకుండా, ఆర్థికంగా ఎదిగేందుకు కావాల్సిన నైపుణ్యాలను పెంచుకునేందుకు వారికి శిక్షణ ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే తాజా ఘటనలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం నగరంలో 1,500 మంది చిన్నారులు ఈ ఊబిలో చిక్కుకున్నట్లు స్పష్టమైంది. కొన్ని ముఠాలు కిడ్నాప్ చేసిన పిల్లలను ఇందుకు వాడుతుండగా.. మరోవైపు పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలను ఇటువైపు మళ్లించేలా మరికొన్ని ముఠాలు పని చేస్తున్నాయి.
ఇటీవల ఎక్కువైంది:
నగరంలో చిన్నారులతో భిక్షాటన చేయించడం లాక్‌డౌన్ తర్వాత ఎక్కువైంది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులతో ఈ పనిచేస్తుండగా, మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భిక్షాటన ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. బాలలను రక్షించేందుకు, యాచకరహిత నగరంగా మార్చేందుకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, జీహెచ్‌ఎంసీలతో మేంకలిసి పని చేస్తున్నాం.
- అరుణ్, యంగిస్థాన్ ఫౌండేషన్