వసంత రుతువు వస్తోందంటే చాలు... భాగ్యనగర వాసులను ఆకట్టుకోవడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. నగరంలోని నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతాల్లోని ప్రకృతి పర్యాటకుల మనసు దోచేస్తుంది. పచ్చని చెట్లు, రంగురంగుల పూల అందాలు అటువైపు వెళ్లే వారిని కట్టిపడేస్తున్నాయి. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలోనైతే... పుడమి తల్లి అందాలు సరికొత్త శోభను సంతరించుకుంటాయి.
సెలవులు, పండుగలు వచ్చాయంటే నగరవాసులు నెక్లెస్‌రోడ్‌లో వాలిపోతారు. వారికోసమే అన్నట్లు స్వాగతం పలికే పచ్చదనం చూసి పులకరించిపోతారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడి ప్రకృతి అందాలకు పరవశించిపోని వారుండరు. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు చిన్నారుల కోలాహలం ఈ ప్రాంతాన్ని నయనానందకరంగా మారుస్తోంది.
వసంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, సేదదీరేందుకు ప్రకృతి ప్రేమికులు వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటారు. మన భాగ్యనగరంలోని నెక్లెస్‌రోడ్, సాగర్ పరిసర ప్రాంతాలు ఆ లోటును తీరుస్తూ..... ప్రకృతి ప్రేమికులకు చక్కటి ఆహ్లాదంతో పాటు మానసిక ఉల్లాసం అందిస్తున్నాయి.
- ఇదీ చూడండి : సమీక్ష : 'ప్రెజర్ కుక్కర్'లో కథ ఉడికిందా..?