BC 1 Lakh Scheme in Telangana : తెలంగాణలో ఈ ఏడాది చివరన ఎన్నికలు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజల ఓట్లను ఆకర్షించడమే వ్యూహంగా అధికార పార్టీ నయా పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్‌లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 'బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం'(Telangana BC 1 Lakh Scheme) అనే మరో కొత్త సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
Telangana BC Bandhu Second Phase : విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో పథకానికి జూన్ 6 నుంచి 20 వరకు ఆయా వృత్తుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం రోజు(జూన్ 9)న మంచిర్యాలలో తొలి లబ్దిదారుడికి సీఎం కేసీఆర్ లక్ష ఆర్థికసాయం(CM KCR Mancherial Tour) చెక్కును అందించి ఈ పథకాన్ని ప్రారంభించారు.
Rs. 1 Lakh for BCs in Telangana : మొత్తం 5.28 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 4.21 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. తదుపరి మొదటి విడతగా ప్రతి నెల 15నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 300-400 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ సజావుగా సాగలేదు. దాంతో ఆగస్టు 15 నుంచి రెండో విడత బీసీలకు లక్ష ఆర్థిక సాయం(Telangana BC 1 Lakh Scheme Second Phase) లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయింది. అయితే అందులో మీరు ఉన్నారో లేదో కింద పేర్కొన్న అర్హతలు, సమర్పించిన పత్రాలు, ఎంపిక ప్రక్రియ విధివిధానాల ద్వారా తెలుసుకోండిలా...
ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలిలా :
1. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు 'లక్ష రూపాయల ఆర్థిక సాయం' పథకానికి అర్హులు
2. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది.
3. జూన్ 2 నాటికి 18నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
4. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు మించరాదు.
5. ఆయా కులాల పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఈ ఆర్థికసాయం అందిస్తారు.
6. గత 5 సంవత్సరాలలో దరఖాస్తుదారుడు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థికసాయం పొంది ఉండకూడదు.
7. అదేవిధంగా 2017-18లో రూ.50వేల ఆర్థికసాయం పొందినవారు కూడా ఈ పథకానికి అనర్హులు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన పత్రాలు :
1. రేషన్‌కార్డు
2. ఆధార్ కార్డు(దరఖాస్తుదారు కుటుంబంలో అందరివి)
3. కుల ధ్రువీకరణ పత్రం
4. ఆదాయ ధ్రువీకరణ పత్రం
5. బ్యాంక్ అకౌంట్ వివరాలు
6. పాన్ కార్డు
7. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారంటే..
- ఆయా నియాజకవర్గాల్లో మండలస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు పర్యటించి దరఖాస్తుదారుల వివరాలు పరిశీలిస్తారు.
- ఆ తదుపరి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి వివరాలు పంపిస్తారు.
- కలెక్టర్ పరిశీలన అనంతరం ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం పొందాలి.
- ఆ తర్వాత ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో ప్రకటిస్తారు.
- అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వారికి మొదటి ప్రాధాన్యతనిస్తారు.
- ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష ఆర్థికసాయాన్ని ఎంపికైన వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.
దరఖాస్తు విధానం : https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తుదారులు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి.
ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్న కులాల జాబితా : 1. నాయూ బ్రాహ్మణులు, 2. రజక, 3. సరగ లేదా ఉప్పర, 4. కుమ్మరి లేదా శాలివాహన, 5. గోల్డ్‌స్మిత్, 6. కంసాలి, 7. వడ్రంగి, శిల్పులు, 8. వడ్డెర, 9. కమ్మరి, 10. కంచరి, 11. మేదర, 12. కృష్ణ బలిజ పూసల, 13. మేర (టైలర్స్), 14. అరె కటిక, 15. ఎంబీసీ కులాలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్(Telangana Government) అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో 36 కులాలను చేర్చింది. వీరిలో దొమ్మర, జంగం, పెద్దమ్మవండ్లు, వీరముష్టి, గుడల, దాసరి, పాములు, పర్తి కంజర, రెడ్డిక, మందుల, బుక్క అయ్యవారు, రాజన్న వంటి కులాలను పేర్కొంది.
ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఎందుకు ఉపయోగించాలంటే : ఆయా కులాల పనిముట్ల కొనుగోలు, ముడి సరుకు లేదా ఆధునికీకరణకు ఈ డబ్బును వినియోగించాల్సి ఉంటుంది. నెలలోగా ఆ నిధులతో కుల వృత్తుల సామాను కొనాల్సి ఉంటుంది.