బతుకమ్మ పండగ (ఈ నెల 17) సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ. 317 కోట్లతో సిరిసిల్లలో తయారు చేయించిన కోటి చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. 287 డిజైన్లు, బంగారు, వెండీ జరీ అంచులతో ఈసారి చీరలు రూపొందించారు. వీటిని సిరిసిల్ల నుంచి జిల్లా కేంద్రాలకు వాహనాల్లో చేర్చారు. కలెక్టర్లు మండలాలకు పంపించారు. ఈ నెల 9 నుంచి పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా చీరల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 వరకు పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించింది. నేరుగా ఇళ్లకు గాని, కేంద్రాల ద్వారా గాని పంపిణీ చేయాలని సూచించింది. కరోనా దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పంపిణీ ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారీగా రేషన్ దుకాణాల సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు, నగరాలు, పట్టణాల్లో రేషన్ డీలర్, పురపాలక బిల్‌కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. ఇళ్లకు పంపిణీ చేసే చీరలకు లబ్ధిదారుల సంతకంతో కూడిన రశీదు తీసుకోవాలి. కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు ఆహార భద్రత కార్డులు తీసుకురావాలి. ఈ సందర్భంగా భౌతిక దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి.
ఇదీ చదవండిః బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల