Telangana Budget Sessions 2023-24: శాసనసభలో నేటి నుంచి బడ్జెట్ కేటాయింపులపై చర్చ ప్రారంభంకానుంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సాధారణ చర్చ, మంత్రి హరీశ్‌రావు సమాధానం.. నిన్నటితో ముగిసింది. నేటి నుంచి బడ్జెట్ పద్దులపై మూడురోజులపాటు చర్చ జరగనుంది. తొలి రోజైన నేడు సంక్షేమం, రహదారులు - భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, లెజిస్లేచర్, పౌరసరఫరాలు, పర్యాటక, క్రీడా శాఖలకు చెందిన.. మొత్తం 12 పద్దులపై చర్చచేపడతారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చసాగనుంది.
Telangana Assembly Sessions 2023: ప్రశ్నోత్తరాల్లో ఎస్ఆర్డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, ఆర్టీసీ ద్వారా సరుకు రవాణా, కళ్యాణలక్ష్మి పథకం, ఏకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగడంతో పాటు చర్చకు మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమాధానమిస్తారు. మండలిలో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి.
చరిత్రలో తొలిసారి ఫిబ్రవరిలోనే : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్‌అకౌంట్ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబరు అయిదో తేదీన బడ్జెట్ సమావేశం జరిగింది. 2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరగగా.. మరుసటి ఏడాది సెప్టెంబరు 9న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
సమావేశాల తర్వాత అమల్లోనే పాత బడ్జెట్: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అంతా భావించినా.. కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. ఇంత త్వరగా బడ్జెట్ సమావేశాల ముగింపుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: