Banks stopped disbursing money: హైదరాబాద్: ప్రస్తుత యాసంగిలో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకంలో జమచేస్తున్న సొమ్మును బ్యాంకులు ఆపేస్తున్నాయి. ఆ మొత్తాన్ని పాత బాకీ ఖాతాలకు మళ్లిస్తున్నాయి. గత పదిరోజుల్లో 54.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.4,327.93 కోట్లను వ్యవసాయశాఖ జమచేసింది. కానీ రైతు పంట రుణం పాత బాకీ చెల్లిస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కొన్ని బ్యాంకులు కరాఖండిగా చెపుతున్నాయి.
ఇవే కాకుండా గత వానాకాలంలో పండించిన వరిధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆ సొమ్మును కూడా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఆ సొమ్మునూ పాత బాకీ ఖాతాలకే బ్యాంకులు మళ్లిస్తున్నాయి. వానాకాలం పంట సొమ్ము రాక, రైతుబంధు కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్మూ అందక యాసంగి పంటల సాగుకు సొమ్ముల్లేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుబంధు సొమ్మును ఆపవద్దని, ఇతర బాకీలు ఉన్నా వాటితో దీనిని ముడిపెట్టకుండా నగదు ఇచ్చేయాలని వ్యవసాయశాఖ గతంలో బ్యాంకులకు చెప్పినా క్షేత్రస్థాయిలో బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు.
గొల్ల కురుమల సొమ్మూ పాత బాకీలకే.. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ గొర్రెల పంపిణీకి గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఇటీవల నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని ప్రారంభించింది. తొలుత ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని 4699 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.లక్షా 58 వేల చొప్పున ఈ శాఖ జమచేసింది. ఈ సొమ్మును కూడా పాతబాకీ ఖాతా కింద తీసుకున్నామని, గొర్రెలు కొన్నా ఇచ్చేది లేదని బ్యాంకులు చెపుతున్నాయని గొల్ల, కురుమలు వాపోతున్నారు. ధాన్యం అమ్మిన డబ్బును కూడా ఆపడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గొల్ల, కురుమల సంఘాల నేత జక్కలి ఐలయ్య యాదవ్ ‘ఈనాడు’కు చెప్పారు.
రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం రైతు పంట రుణం తీసుకుంటే తిరిగి ఏడాదిలోగా కట్టడానికి బ్యాంకు గడువు ఇవ్వాలి. ఈలోగా అడగటానికి వీలులేదు. కానీ రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పాత రుణాలను తిరిగి చెల్లిస్తుందని భావించి రైతులు కట్టడం లేదని ఓ బ్యాంకు రాష్ట్రస్థాయి అధికారి ఒకరు చెప్పారు. పాత బాకీ పూర్తిగా కట్టకున్నా కనీసం వడ్డీ కట్టి తిరిగి కొత్తరుణం తీసుకున్నట్లు రెన్యూవల్ చేసుకోవాలని చెప్పినా పలువురు రైతులు ముందుకు రావడం లేదని ఆయన వివరించారు. ఒకసారి పంటరుణం తీసుకున్న తరవాత వరసగా మూడో పంట సీజన్‌లోగా తిరిగి కట్టకపోతే ఆ ఖాతాను నిలిపివేస్తామన్నారు. తాము రిజర్వుబ్యాంకు నిబంధనలనే పాటిస్తామని, పాతబాకీలు కట్టనివారి పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును విడుదల చేయకుండా నిలిపివేసే అధికారం తమకు ఉందని ఓ బ్యాంకు అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. రైతుబంధు కింద వ్యవసాయశాఖ జమచేసిన నిధులను బ్యాంకులు ఆపడానికి వీల్లేదని ఆశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
రైతుబంధు సొమ్ము ఇవ్వక వరినాట్లు వేయలేకపోతున్నా
నాకు 4.36 ఎకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం కింద ప్రస్తుత యాసంగి పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద రూ.24,250 నా బ్యాంకు ఖాతాలో పడ్డాయి. బ్యాంకుకెళ్లి సొమ్ము ఇవ్వాలని అడిగితే పాత పంటరుణం బాకీ రూ.లక్షా 36 వేలు ఉందని, దానికి జమ చేసుకున్నట్లు బ్యాంకు సిబ్బంది చెప్పారు. గత వానాకాలంలో పండిన ధాన్యాన్ని గత నెలలో అమ్మితే రూ.29,664లను ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో జమచేసింది. ఆ సొమ్మునూ పాత పంటరుణం బాకీకే జమచేసుకున్నారు. ఇప్పుడు పెట్టుబడి దొరక్క నాట్లు వేయలేకపోతున్నాను. మా గ్రామంలో చాలా మంది రైతులకు ఇలాగే రైతుబంధు సొమ్ములను బ్యాంకు ఇవ్వలేదు. -గోవిందరెడ్డి, రైతు,
రైతుబంధులో వచ్చిన రూ.15 వేలు ఇవ్వకుండా ఆపేశారు
నాకు 3 ఎకరాలపొలం ఉంది. రైతుబంధు కింద రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో వేశారు. డబ్బు తీసుకుందామని బ్యాంకుకెళ్తే పాత పంటరుణం బాకీ కట్టలేదని ఖాతాను నిలిపివేసినట్లు సిబ్బంది చెప్పారు. నేను గతంలో రూ.68 వేల పంటరుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లిస్తుందని తిరిగి కట్టలేదు. ఇప్పుడు రైతుబంధు సొమ్మును దానికి జమచేశామని, మిగతా సొమ్ము కడితేనే మళ్లీ కొత్త రుణం ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇప్పటికిప్పుడు పాతబాకీ కట్టడానికి డబ్బు లేదు. యాసంగి పంటల సాగుకు రూ.2 వడ్డీతో ప్రైవేటు వ్యాపారి వద్ద రూ.50 వేల అప్పు తెచ్చుకున్నా. - మంద శోభ, మహిళా రైతు, వెల్దండ గ్రామం, జనగామ జిల్లా
ఫిర్యాదు చేయండి.. సొమ్ము ఇప్పిస్తాం
ఇప్పటికే 54 లక్షల మందికి పైగా రైతులఖాతాల్లో రైతుబంధు కింద సొమ్మును జమచేశాం. ఏ బ్యాంకులోనైనా ఖాతాలను నిలిపివేసి, సొమ్ము విడుదల చేయకపోతే వెంటనే సమీపంలోని వ్యవసాయాధికారికి రైతులు ఫిర్యాదు చేయాలి. ఆ బ్యాంకుకు వెళ్లి. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఖాతాలను తిరిగి తెరిపించి డబ్బు ఇప్పించాలని క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులకు ఆదేశాలిస్తాం. బ్యాంకులు కూడా మానవతా దృక్పథంతో రైతుబంధు సొమ్మును రైతులకు ఇవ్వాలి. యాసంగి వేళ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయప్రయాలసకోర్చి రైతుబంధు కింద రూ.7 వేల కోట్లను దశలవారీగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. వాటిని ఏ బ్యాంకు ఆపినా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాధికారుల ద్వారా విచారణ జరిపి రైతులకు ఇప్పిస్తుంది. -ఎస్.నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
ఇవీ చదవండి: