రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద జమ చేసిన మొత్తంలో రైతులకు చెల్లించిందిపోగా.. మిగిలిన మొత్తాన్ని 15 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ బేగంపేట మ్యారీగోల్డ్ హోటల్‌లో జరిగిన 25వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ ఓం ప్రకాశ్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్హ పాల్గొన్నారు.
రాష్ట్రంలో రుణమాఫీ, రైతుబంధు పథకాలు ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రుణాల పంపిణీ, రుణ లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. గత రుణమాఫీలో ఆడిట్ సందర్భంగా తెలిసిన అంశాలపై మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లకు వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో... పలు స్థాయి అధికారుల ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు సంబంధించి జనవరి 10 లోగా వివరాలు అందించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసిందని... ఈ పథకం కింద బ్యాంకులు పేర్కొన్న మొత్తం బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రైతుల రూ. లక్ష అప్పు రుణమాఫీ చేయగా... మిగిలిన మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు. సామాజిక పెన్షన్స్ పథకం కింద చనిపోయిన వారి వివరాలు పంచాయతీ శాఖ ద్వారా బ్యాంకులకు వివరాలు అందించగానే... మిగిలిన మొత్తం జనవరి మాసంలోగా తిరిగి ప్రభుత్వానికి అందించాలని మంత్రి కోరారు.