రాష్ట్ర ప్రజలు, వీరశైవ లింగాయత్‌లకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మహాత్మా బసవేశ్వర 888వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని వర్ణ, వర్గ, లింగ వివక్షతపై బసవేశ్వరుడు ఆ రోజుల్లోనే పోరాడారని కొనియాడారు.
అన్ని వర్ణాలు, అన్ని కులాలు, మహిళలతో కూడిన అనుభవ మంటపం అనే పార్లమెంటరీ వ్యవస్థను 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు ప్రపంచానికి పరిచయం చేశారని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ సమాజ స్థాపనకు ఆయన కృషి చేశారని కొనియాడారు. ఆయన బోధనలు, వచనాలు ఈ తరానికి ఎంతో అవసరమన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో లింగాయత్‌లు బసవ జయంతిని ఘనంగా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడు చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని కోరారు.
ఇదీ చూడండి: కారణం ఏదైనా అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారు: హైకోర్టు